2 Chronicles 34 (IRVT2)
1 యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు. 3 తన పాలన 8 వ సంవత్సరంలో తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12 వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలనూ అషేరా దేవతాస్తంభాలనూ పడగొట్టి, చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ తీసివేసి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేయడం మొదలు పెట్టాడు. 4 అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు. 5 ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు. 6 అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు. 7 అతడు బలిపీఠాలనూ అషేరా దేవత స్తంభాలనూ పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడి చేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపవేదికలను నరికి వేసి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు. 8 అతని పాలనలో 18 వ ఏట దేశాన్నీ మందిరాన్నీ బాగు చేయించిన తరువాత, అతడు అజల్యా కొడుకు షాఫానునూ పట్టణ అధిపతి మయశేయానునూ కార్యదర్శి యోహాహాజు కొడుకు యోవాహాజునూ తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి పంపాడు. 9 వారు ప్రధానయాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి, అంతకు ముందు దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలి ఉన్న వారందరి దగ్గరనుంచి, యూదా బెన్యామీనీయులందరి దగ్గరనుంచి ఆ డబ్బు సమకూర్చారు. 10 వారు ఆ డబ్బుని యెహోవా మందిరపు పనిమీద ఉన్న తనిఖీదారులకు అప్పగించారు. వారు దాన్ని బాగు చేయడానికీ యూదా రాజులు నిర్లక్ష్యం చేసిన ఇళ్ళకు దూలాలను అమర్చడానికీ 11 చెక్కిన రాళ్లను జోడించడానికీ మ్రానులు కొనడానికీ యెహోవా మందిరంలో పనిచేసేవారికీ శిల్పకారులకూ ఆ డబ్బులిచ్చారు. 12 ఆ మనుష్యులు నమ్మకంగా ఆ పని చేశారు. వారి మీద తనిఖీదారులు ఎవరంటే, లేవీ గోత్రీకుల్లో మెరారీ వంశం వారైన యహతు, ఓబద్యా, కహాతు వంశీకులు జెకర్యా, మెషుల్లాము. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీయులంతా వాయిద్యాలు వాయించడంలో ఆరితేరిన వారు. 13 బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు. 14 యెహోవా మందిరంలోకి తెచ్చిన డబ్బును బయటికి తీసుకు వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా అందించిన ధర్మశాస్త్రగ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది. 15 అప్పుడు హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు. 16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుపోయి రాజుతో ఇలా అన్నాడు. “నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేస్తున్నారు. 17 యెహోవా మందిరంలో దొరికిన డబ్బుని వారు పోగు చేసి తనిఖీదారుల చేతికీ పనివారి చేతికీ అప్పగించారు.” 18 “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు” అని లేఖకుడు షాఫాను, రాజుకు చెప్పి, దాన్ని రాజు ఎదుట చదివి వినిపించాడు. 19 అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించినప్పుడు రాజు విని తన బట్టలు చించుకుని 20 హిల్కీయాకూ, షాఫాను కొడుకు అహీకాముకూ, మీకా కొడుకు అబ్దోనుకూ, శాస్త్రి అయిన షాఫానుకూ, రాజు సేవకుడు అశాయాకూ ఇలా ఆజ్ఞాపించాడు, 21 “మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.” 22 అప్పుడు హిల్కీయా, రాజు నియమించినవారూ హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు. ఆమె షల్లూము భార్య. అతడు తిక్వా కొడుకు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె అప్పుడు యెరూషలేముకు చెందిన రెండవ భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు. 23 ఆమె వారితో ఇలా చెప్పింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే, 24 ‘వినండి, నేను ఈ స్థలం మీదికీ, దానిలో నివసించేవారి మీదికీ విపత్తు తీసుకు రాబోతున్నాను, యూదా రాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను. 25 వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి, 26 నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియచేసేదేంటంటే, 27 ‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన. 28 ‘నేను నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను చేరుస్తాను. నీవు ప్రశాంతంగా నీ సమాధికి చేరతావు. ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా నేను రప్పించే విపత్తు నీవు నీ కంటితో చూడవు.’” వారు రాజు దగ్గరికి ఈ సందేశం తీసికెళ్లారు. 29 రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు. 30 రాజూ, యూదావారంతా, యెరూషలేము నివాసులంతా, యాజకులూ, లేవీయులూ, ప్రజల్లో గొప్పవారూ, సామాన్యులూ యెహోవా మందిరానికి వచ్చారు. ఆప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు. 31 రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు. 32 అతడు యెరూషలేములో ఉన్న వారందరినీ బెన్యామీనీయులందరినీ ఆ నిబంధనకు సమ్మతించేలా చేశాడు. యెరూషలేము నివాసులు తమ పూర్వీకుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు. 33 యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలోనుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.
In Other Versions
2 Chronicles 34 in the ANTPNG2D
2 Chronicles 34 in the BNTABOOT
2 Chronicles 34 in the BOATCB2
2 Chronicles 34 in the BOGWICC
2 Chronicles 34 in the BOHNTLTAL
2 Chronicles 34 in the BOILNTAP
2 Chronicles 34 in the BOKHWOG
2 Chronicles 34 in the KBT1ETNIK
2 Chronicles 34 in the TBIAOTANT