Jeremiah 25 (IRVT2)
1 యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము నాలుగో సంవత్సరం పాలనలో, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు వచ్చిన సందేశం. 2 ప్రవక్త యిర్మీయా యూదా ప్రజలందరితో, యెరూషలేము నివాసులందరితో ఆ సందేశాన్ని ప్రకటించాడు. 3 “ఆమోను కొడుకు యూదా రాజు యోషీయా పాలించిన 13 వ సంవత్సరం మొదలు నేటివరకూ ఈ 23 సంవత్సరాలు యెహోవా నాకు సందేశం ఇస్తూ ఉన్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ మీరు పెడచెవిన పెట్టారు. 4 యెహోవా మీ దగ్గరికి తన సేవకులైన ప్రవక్తలను పంపించాడు. మీరు వారి మాట వినలేదు, వారిపట్ల శ్రద్ధ చూపలేదు. 5 ఈ ప్రవక్తలు ఇలా చెప్పారు, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గం, దురాచారాల నుంచి మళ్ళుకోండి. యెహోవా మీకూ, మీ పూర్వీకులకూ శాశ్వతమైన బహుమానంగా దయచేసిన ఈ దేశంలో మీరు నివసించేలా చేసుకోండి. 6 మీరు ఇతర దేవుళ్ళను పూజించడం, వాటికి నమస్కారం చేయడం మానండి. మీ చేతులతో చేసిన వాటితో నన్ను విసికించవద్దు. అప్పుడు ఆయన మీకు ఏ బాధా కలిగించడు.’ 7 అయితే మీరు నా మాట వినలేదు. మీ చేతులతో చేసుకున్న వాటి మూలంగా నేను మిమ్మల్ని శిక్షించేలా నన్ను రెచ్చగొట్టారు” అని యెహోవా చెబుతున్నాడు. 8 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీరు నా మాటలు వినలేదు కాబట్టి నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాలన్నిటినీ నా సేవకుడు నెబుకద్నెజరు అనే బబులోను రాజునూ పిలిపిస్తున్నాను. 9 ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను. 10 సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను. 11 ఈ దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు. 12 డెబ్భై సంవత్సరాలు గడచిన తరువాత వారి దోషాలనుబట్టి నేను బబులోను రాజును, ఆ ప్రజలను, కల్దీయుల దేశాన్ని శిక్షిస్తాను. ఆ దేశాన్ని ఎప్పటికీ శిథిలంగా ఉండేలా చేస్తాను.” ఇది యెహోవా వాక్కు. 13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా చెప్పిన మాటలన్నిటి ప్రకారం, రాజ్యాలన్నిటి గురించి ఈ గ్రంథంలో రాసినదంతా యిర్మీయా ప్రవచించినట్టు ఆ దేశం మీదికి రప్పిస్తాను. 14 ఎందుకంటే నేను వాళ్ళ పనులకూ వాళ్ళు చేతులతో చేసిన వాటికీ ప్రతీకారం చేస్తాను. అనేక రాజ్యాలూ, గొప్ప రాజులూ వాళ్ళ చేత సేవ చేయించుకుంటారు. 15 ఇశ్రాయేలు దేవుడు, యెహోవా నాతో ఇలా చెప్పాడు. “కోపంతో నిండి ఉన్న మద్యపాత్రను నువ్వు నా చేతిలోనుంచి తీసుకుని, నేను నిన్ను పంపిస్తున్న రాజ్యాలన్నిటికీ దాన్ని తాగించు. 16 వాళ్ళు దాన్ని తాగి, తూలుతూ పిచ్చివాళ్ళలాగా అయిపోతారు. నేను వాళ్ళ మీదకు పంపిస్తున్న కత్తిని బట్టి వాళ్ళు అలా అవుతారు.” 17 అప్పుడు యెహోవా చేతిలో నుంచి నేను ఆ పాత్రను తీసుకుని, యెహోవా నన్ను పంపిన రాజ్యాలన్నిటికీ దాన్ని తాగించాను. 18 వాళ్ళు ఈ రోజు ఉన్నట్టుగా అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉండడానికి యెరూషలేముకూ యూదా పట్టణాలకూ దాని గొప్ప రాజులకూ దాని అధిపతులకూ తాగించాను. 19 మిగతా రాజ్యాలు కూడా తాగాల్సి వచ్చింది. ఐగుప్తురాజు ఫరో, అతని సేవకులూ అతని అధికారులూ అతని పరివారమంతా, 20 అక్కడ ఉన్న మిశ్రిత ప్రజలూ, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిష్తీయుల దేశపు రాజులందరూ, అష్కెలోను, గాజా, ఎక్రోను, అష్డోదులో మిగిలిన వాళ్ళూ, 21 ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు దానిలోనిది తాగుతారు. 22 ఇంకా తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రానికి అవతలి తీరాల రాజులూ, 23 దదానీయులు, తేమానీయులు, బూజీయులు, గడ్డపు పక్కల కత్తిరించుకున్నవాళ్ళు, 24 అరేబియా దేశపు రాజులందరూ, ఎడారిలో ఉంటున్న మిశ్రిత ప్రజల రాజులందరూ, 25 జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, 26 ఉత్తర దిక్కున దగ్గరగా, దూరంగా ఉన్న రాజులందరూ, భూమి మీద ఉన్న ప్రపంచ రాజ్యాలన్నీ దానిలోనిది తాగుతారు. చివరిగా బబులోను రాజు వాళ్ళ తరువాత తాగుతాడు. 27 నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, తాగండి! మత్తేక్కే వరకు తాగి, కక్కండి. నేను మీ మీదికి పంపించే కత్తి ఎదుట మళ్ళీ లేవకుండా కూలండి.” 28 మేము తాగమని వాళ్ళు నీ చేతిలో నుంచి ఆ పాత్రను తీసుకోకపోతే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు, మీరు తప్పకుండా దాన్ని తాగాలని సేనల అధిపతి యెహోవా చెబుతున్నాడు. 29 నా పేరున్న పట్టణానికి నేను విపత్తు రప్పించబోతున్నాను. మీకు శిక్ష లేకుండా పోతుందా? మీరు తప్పించుకోలేరు. భూమి మీద ఉంటున్న వారందరి మీదికి నేను కత్తిని రప్పిస్తున్నాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 30 కాబట్టి యిర్మీయా! నువ్వు ఈ మాటలన్నీ వారికి ప్రకటించు. వారికిలా చెప్పు “యెహోవా పైనుంచి గర్జిస్తున్నాడు. తన పవిత్ర నివాసం నుంచి తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. తన నివాస స్థలానికి విరోధంగా గర్జిస్తున్నాడు. దేశంలో నివసిస్తున్న వారందరికీ వ్యతిరేకంగా కేకలు వేస్తున్నాడు. ద్రాక్షగానుగ తొక్కే వారిలాగా అరుస్తున్నాడు. 31 ప్రపంచమంతా ఆ సందడి చేరింది. యెహోవా రాజ్యాలతో నేరారోపణ చేస్తున్నాడు. మనుషులందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన దుర్మార్గులను కత్తికి గురిచేస్తాడు.” ఇది యెహోవా వాక్కు. 32 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి విపత్తు వ్యాపిస్తూ ఉంది. భూదిగంతాల నుంచి గొప్ప తుఫాను బయలుదేరుతూ ఉంది. 33 ఆ రోజు యెహోవా చేత హతం అయిన వాళ్ళు భూమి ఒక అంచు నుంచి మరొక అంచు వరకూ ఉంటారు. వాళ్ళ కోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగుచేయరు. పాతిపెట్టరు. పెంటలాగా వారి శవాలు నేల మీద పడి ఉంటాయి. 34 కాపరులారా, ఏడవండి. సాయం కోసం కేకలు పెట్టండి. మందలోని నాయకులారా, నేల మీద పడి దొర్లండి. మీరు చావడానికి రోజులు దగ్గరపడ్డాయి. మీరు చెదిరిపోయే రోజు వచ్చింది. ఎంపిక చేసిన గొర్రె పొట్టేళ్ళు కింద పడినట్టు మీరు పడతారు. 35 కాపరులకు దాక్కునే చోటు ఉండదు. మందలోని శ్రేష్ఠమైన వాటికి దాక్కునే చోటు లేదు. 36 వినండి, కాపరుల కేకలూ, మందలోని శ్రేష్ఠమైన వాటి గోల వినిపిస్తూ ఉంది. యెహోవా వాళ్ళ పచ్చిక మైదానాలను నాశనం చేస్తున్నాడు. 37 ప్రశాంతంగా ఉన్న మైదానాలు యెహోవా కోపాగ్నికి పాడైపోతున్నాయి. 38 గుహలోనుంచి కొదమ సింహం వచ్చినట్టు ఆయన బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళ దేశం ఆయన కోపాగ్నికి నాశనమైపోతుంది.”