2 Chronicles 35 (IRVT2)
1 యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కాపండగ ఆచరించాడు. మొదటి నెల 14 వ రోజున ప్రజలు పస్కా పశువును వధించారు. 2 అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవా మందిరసేవను జరిగించడానికి వారిని ధైర్యపరచి 3 ఇశ్రాయేలీయులందరికి బోధిస్తూ, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు “పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా, ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. 4 ఇశ్రాయేలీయుల రాజు దావీదు రాసి ఇచ్చిన క్రమం ప్రకారం, అతని కొడుకు సొలొమోను రాసి ఇచ్చిన క్రమం ప్రకారం మీ మీ పూర్వీకుల కుటుంబాలకు ఏర్పాటైన వరసలనుబట్టి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి.” 5 మీరు పరిశుద్ధ స్థలం లో నిలిచి, ప్రజల, పూర్వీకుల కుటుంబాల వరసలను బట్టి లేవీయుల పూర్వీకుల కుటుంబాల్లో ఉన్న వంతుల ప్రకారం సేవకు నిలబడండి. 6 పస్కా గొర్రె పిల్లను వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొనండి. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దాన్ని మీ సోదరుల కోసం సిద్ధపరచండి. 7 యోషీయా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ 3,000 కోడెదూడలనూ అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసం ఇచ్చాడు. 8 అతని అధికారులు ప్రజలకూ, యాజకులకూ, లేవీయులకూ మనసారా ఇచ్చారు. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలూ పస్కాబలి కోసం యాజకులకు 2, 600 చిన్న పశువులనూ 300 కోడెదూడలనూ ఇచ్చారు. 9 కొనన్యా, అతని సోదరులైన షెమయా, నెతనేలూ, లేవీయుల్లో ముఖ్యులు హషబ్యా యెహీయేలూ యోజాబాదూ పస్కాబలి కోసం లేవీయులకు 5,000 గొర్రెలనూ 500 కోడెదూడలనూ ఇచ్చారు. 10 సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలం లోనూ, లేవీయులు తమ వరసల్లోనూ నిలబడ్డారు. 11 లేవీయులు పస్కాపశువులను వధించి రక్తాన్ని యాజకులకిచ్చారు. వారు దాన్ని చల్లారు. లేవీయులు జంతువుల చర్మాలను ఒలిచారు. 12 మోషే గ్రంథంలో రాసినట్టు ప్రజల వంశాల ప్రకారం పంచిపెట్టడానికీ యెహోవాకు అర్పణగా ఇవ్వడానికీ దహనబలి మాంసాన్ని యాజకులు పక్కన ఉంచారు. వారు ఎడ్లను కూడా అలాగే చేశారు. 13 వారు యధావిధిగా పస్కా గొర్రెపిల్లలను నిప్పుమీద కాల్చారు. ఇతర ప్రతిష్ఠార్పణలను కుండల్లో భాండీల్లో పెద్ద బిందెల్లో ఉడికించి ప్రజలందరికీ త్వరగా వడ్డించారు. 14 తరువాత లేవీయులు తమ కోసం, యాజకుల కోసం అర్పణ సిద్ధం చేశారు. అహరోను సంతతివారైన యాజకులు దహనబలి అర్పణలనూ కొవ్వునూ రాత్రి వరకూ అర్పించ వలసి వచ్చింది కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను సంతతివారైన యాజకుల కోసం అర్పణలను సిద్ధపరిచారు. 15 ఆసాపు సంతతివారైన గాయకులు, తమ స్థలాల్లో ఉన్నారు. ఆసాపూ, హేమానూ, రాజుకు దార్శనికుడైన యెదూతూనూ దావీదు నియమించినట్టుగా తమ స్థలం లో ఉన్నారు. ప్రతి గుమ్మం దగ్గరా ద్వారపాలకులున్నారు. వారు తమ పని విడిచి రాకుండా వారి సోదరులైన లేవీయులు వారి కోసం అర్పణ సిద్ధపరిచారు. 16 కాబట్టి రాజైన యోషీయా ఆజ్ఞాపించిన ప్రకారం వారు పస్కాపండగ ఆచరించి, యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం వలన ఆ రోజు ఏ లోపం లేకుండా యెహోవా సేవ జరిగింది. 17 అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు, ఆ సమయంలో పస్కా అనే పొంగని రొట్టెల పండగను ఏడు రోజులు ఆచరించారు. 18 సమూయేలు ప్రవక్త రోజులనుంచి ఇశ్రాయేలులో పస్కాపండగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యాజకులూ, లేవీయులూ, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలువారూ, యెరూషలేము నివాసులతో కలసి యోషీయా పస్కా పండగ ఆచరించినట్టు ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజూ పస్కా పండగ ఆచరించ లేదు. 19 యోషీయా పాలనలో 18 వ సంవత్సరం ఈ పస్కా పండగ జరిగింది. 20 ఇదంతా అయిన తరువాత, యోషీయా మందిరాన్ని చక్కపెట్టిన తరువాత ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యోషీయా అతనితో పోరాడడానికి వెళ్ళాడు. 21 అయితే నెకో అతని దగ్గరికి రాయబారులను పంపి “యూదా రాజా, నాకూ నీకూ విరోధమేంటి? నేను ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి రాలేదు, కానీ నేను యుద్ధం చేయబోతున్న వాడి పైకి వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి దేవుని జోలికి నీవు రావద్దు. ఆయన నాతో ఉన్నాడు. లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు” అని చెప్పాడు. 22 అయినా యోషీయా అతని దగ్గరనుంచి వెళ్ళిపోడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయడానికి మారువేషం వేసుకుని, యెహోవా నోటిమాటగా నెకో చెప్పింది వినలేదు. మెగిద్దో లోయలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. 23 విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో “నాకు పెద్ద గాయం అయింది. ఇక్కడ నుంచి నన్ను తీసుకు వెళ్ళండి” అన్నాడు. 24 కాబట్టి అతని సేవకులు రథం మీదనుంచి అతని దింపి, అతనికున్న వేరే రథం మీద అతని ఉంచి యెరూషలేము తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టారు. యూదా యెరూషలేము వారంతా యోషీయా మృతికి విలపించారు. 25 యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి. 26 యోషీయాను గురించిన ఇతర విషయాలు, యెహోవా ధర్మశాస్త్రంలో రాసిన మాటలు బట్టి అతడు చూపిన భయభక్తులు, 27 అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి.
In Other Versions
2 Chronicles 35 in the ANTPNG2D
2 Chronicles 35 in the BNTABOOT
2 Chronicles 35 in the BOATCB2
2 Chronicles 35 in the BOGWICC
2 Chronicles 35 in the BOHNTLTAL
2 Chronicles 35 in the BOILNTAP
2 Chronicles 35 in the BOKHWOG
2 Chronicles 35 in the KBT1ETNIK
2 Chronicles 35 in the TBIAOTANT