Genesis 43 (IRVT2)
1 కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. 2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి “మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి” అని వారితో అన్నాడు. 3 యూదా “అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు. 4 కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము. 5 నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు” అన్నాడు. 6 అందుకు ఇశ్రాయేలు “మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?” అన్నాడు. 7 వారు “అతడు ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. ‘మీ తమ్ముణ్ణి తీసుకు రండి’ అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?” అన్నారు. 8 యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో “ఆ చిన్నవాణ్ని నాతో పంపు. మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వూ మా పిల్లలూ చావకుండా బతుకుతాం. 9 నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకువచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను. 10 మాకు ఆలస్యం కాకపోతే ఈపాటికి రెండవ సారి వెళ్లి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే” అన్నాడు. 11 వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో “అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి. 12 రెండింతల డబ్బు తీసుకు వెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేత పట్టుకుని వెళ్ళండి. బహుశా అది పొరబాటు కావచ్చు. 13 మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి. 14 అతడు మీ అన్ననూ బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు, అతని ముందు మిమ్మల్ని కరుణించు గాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను” అని వారితో చెప్పాడు. 15 వాళ్ళు ఆ కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసుకు ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు. 16 యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో “వీరిని ఇంట్లోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు. 17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు. 18 తమను యోసేపు ఇంటికి తీసుకువెళ్ళినందుకు వారు భయపడి “మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనలను బంధించి, దాసులుగా చెరపట్టి, మన గాడిదలను తీసుకోవచ్చు” అనుకున్నారు. 19 వారు యోసేపు గృహనిర్వాహకుని దగ్గరికి వచ్చి, ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి, 20 “అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము. 21 అయితే, మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే, చూడండి, మా అందరి డబ్బు మొత్తం, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము. 22 ఆహారం కొనడానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు” అని చెప్పారు. 23 అందుకతడు “మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది” అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు. 24 గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు. 25 అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు. 26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు. 27 అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు, 28 “నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అని చెప్పి వంగి సాగిలపడ్డారు. 29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి “మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగి “బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక” అన్నాడు. 30 అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు. 31 అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. 32 అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం. 33 పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు. 34 అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.