2 Kings 19 (IRVT2)
1 వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. 2 గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు. 3 వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు. 4 జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.” 5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, 6 యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు. 7 అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు. 8 అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. 9 అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు. 10 “యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు. 11 చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా? 12 నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా? 13 హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు. 14 హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి, 15 యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు. 16 యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు. 17 యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి 18 వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు. 19 యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు. 20 అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. 21 అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది. 22 నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు? 23 ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను. 24 నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను. 25 నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది. 26 కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు. 27 నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు. 28 నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను. 29 హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. 30 యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. 31 ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది. 32 కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. 33 ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. 34 నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.” 35 ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు. 36 అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు. 37 అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.