2 Samuel 19 (IRVT2)
1 రాజు తన కొడుకు గురించి విలపిస్తూ, విచారంగా ఉన్నాడన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఆనాటి విజయం ప్రజలందరి దుఃఖానికి కారణమయ్యింది. 2 యుద్ధ సమయంలో భయపడి పారిపోయిన ప్రజలు దొంగలవలె తిరిగి పట్టణంలో ప్రవేశించారు. 3 రాజు తన ముఖం కప్పుకుని “అబ్షాలోమా నా బిడ్డా, అబ్షాలోమా నా బిడ్డా” అంటూ కేకలువేస్తూ ఏడుస్తున్నాడని, అబ్షాలోమును గూర్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు. 4 అతడు ఉన్న నగరంలోని భవనానికి వచ్చాడు. 5 “నీ ప్రాణాన్ని, నీ కొడుకుల, కూతుళ్ళ ప్రాణాలను, నీ భార్యల, నీ ఉపపత్నుల ప్రాణాలను రక్షించిన నీ సేవకులనందరినీ నువ్వు సిగ్గుపరుస్తున్నావు. 6 నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ, నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు నీకు ఇష్టమైనవారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్షాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచు. 7 నువ్వు గనుక ఇప్పుడు బయటికి రాకపోతే ఈ రాత్రి ఒక్కడు కూడా నీ దగ్గర ఉండడని యెహోవా పేరట ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ చిన్నప్పటినుండి ఇప్పటివరకూ నీకు కలిగిన కీడులన్నిటికంటే అది నీకు మరీ కష్టంగా ఉంటుంది” అని రాజుతో చెప్పినప్పుడు రాజు లేచి బయటకు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు. 8 రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడన్న సంగతి ప్రజలంతా విని రాజును దర్శించేందుకు వచ్చారు. ఇశ్రాయేలువారంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు. 9 ఆ సమయంలో ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన ప్రజల మధ్య గందరగోళం బయలుదేరింది. వారు “మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోముకు భయపడి దేశం వదలి పారిపోయాడు. 10 మనం రాజుగా పట్టాభిషేకం చేసికొన్న అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కనుక మనం రాజును తిరిగి ఎందుకు తీసుకు రాకూడదు?” అనుకున్నారు. 11 రాజైన దావీదుకు ఈ సంగతి వినబడింది. యాజకులైన సాదోకు, అబ్యాతారుకులను పిలిపించి “ఇశ్రాయేలు వారంతా మాట్లాడుకొంటున్న విషయం రాజుకు తెలిసింది. రాజును నగరానికి మళ్ళీ తీసుకు వెళ్లేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? 12 మీరు నాకు రక్త సంబంధులు, సోదరులు. రాజును తీసుకు వచ్చేందుకు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారని యూదావారి పెద్దలతో చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు. 13 తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి “నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక” అని చెప్పమన్నాడు. 14 అతడు వెళ్లి యూదా వారిలో ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా రాజుకు లోబడేలా చేశాడు. యూదావారు రాజు దగ్గరికి “నువ్వు, నీ సేవకులంతా తిరిగి రావాలి” అన్న కబురు పంపించారు. రాజు బయలుదేరి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు 15 యూదావారు రాజును ఎదుర్కొవడానికి, నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు. 16 అంతలో బహూరీములో ఉంటున్న బెన్యామీనీయుడైన గెరా కొడుకు షిమీ త్వరత్వరగా రాజైన దావీదును ఎదుర్కొనడానికి యూదావారితో కలసి వచ్చాడు. 17 అతనితోపాటు వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబం సేవకుడు సీబా, అతని పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు వచ్చారు. 18 వారంతా రాజు ఎదురుగా నది దాటారు. రాజు, అతని పరివారం నది దాటడానికి, రాజుకు అనుకూలంగా చేయడానికి పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను నది దాటి వెళ్ళగానే గెరా కుమారుడు షిమీ వచ్చి అతనికి సాష్టాంగపడ్డాడు. 19 “నా యజమానీ, నేను చేసినదాన్ని బట్టి నాపై నేరం మోపవద్దు. రాజువైన నువ్వు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను మూర్ఖత్వంతో చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకోవద్దు. 20 నేను పాపం చేశానని నాకు తెలుసు. కనుక రాజువైన నిన్ను కలుసుకోవడానికి యోసేపు వంశం వారందరికంటే ముందుగా వచ్చాను” అన్నాడు. 21 అప్పుడు సెరూయా కుమారుడు అబీషై వచ్చి “యెహోవా అభిషేకించిన రాజును శపించిన ఈ షిమీకి మరణ శిక్ష విధించాలి” అన్నాడు. 22 దావీదు “సెరూయా కొడుకుల్లారా, మీకూ, నాకూ ఏమి సంబంధం? ఇలాంటి సమయంలో మీరు నాకు విరోధులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలు వారిలో ఎవరికైనా మరణశిక్ష విధించడం సమంజసమా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారిమీద రాజునయ్యానన్న సంగతి తెలుసుకున్నాను” అన్నాడు. తరువాత 23 “నీకు మరణశిక్ష విధించను” అని షిమీకి వాగ్దానం చేశాడు. 24 సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు. 25 అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు రాజు “మెఫీబోషెతూ, నీవు నాతో కలసి ఎందుకు రాలేదు?” అని అడిగాడు. 26 అప్పుడు అతడు “నా యజమానివైన రాజా, నీ దాసుడినైన నేను కుంటివాణ్ణి కనుక గాడిదను సిద్ధం చేసి రాజుతో కలసి వెళ్లిపోవాలని నేను అనుకున్నప్పుడు నా పనివాడు నన్ను మోసం చేశాడు. 27 సీబా నా విషయంలో నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు నా ఏలినవాడివి, రాజువు. నువ్వు దేవుని దూతవంటి వాడివి. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. 28 నా తండ్రి కుటుంబం వారంతా నీ దృష్టిలో చచ్చినవారమై ఉన్నప్పుడు, నువ్వు నీ భోజనం బల్ల దగ్గర నీతో భోజనం చేయడానికి దయ చూపించావు. కాబట్టి రాజవైన నిన్ను వేడుకోవడానికి నాకు వేరే అవసరం ఏముంటుంది?” అన్నాడు. 29 అప్పుడు రాజు “నువ్వు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వూ, సీబా భూమిని పంచుకొమ్మని నేను ఆజ్ఞ ఇచ్చాను గదా” అన్నాడు. 30 అందుకు మెఫీబోషెతు “నా ఏలినవాడవైన నువ్వు నీ నగరానికి క్షేమంగా తిరిగి వచ్చావు గనుక అతడు అంతా తీసుకోవచ్చు” అన్నాడు. 31 గిలాదీయుడైన బర్జిల్లయి రోగెలీము నుండి యొర్దాను అవతల నుండి రాజును సాగనంపడానికి వచ్చాడు. 32 ఇప్పుడు బర్జిల్లయి వయసు 80 ఏళ్ళు. వయసు పైబడి బాగా ముసలివాడైపోయాడు. అతడు అత్యంత ధనవంతుడు. రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహార పదార్ధాలు పంపిస్తూ వచ్చాడు. 33 రాజు “నువ్వు నాతోకూడ నది దాటి వచ్చి యెరూషలేములో నాతో కలసి ఉండిపో. నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు. 34 బర్జిల్లయి “రాజువైన నీతో కలసి యెరూషలేముకు వచ్చి ఉండడానికి ఇంకా నేనెంకాలం బతకగలను? 35 ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి? 36 రాజువైన నువ్వు నాపట్ల అంతటి మేలు చూపడానికి నేనెంతటివాణ్ణి? నీ దాసుడనైన నేను నీతో కలసి నది దాటి అవతలకు కొంచెం దూరం వస్తాను. 37 నేను నా ఊరిలోనే ఉండి, చనిపోయి నా తలిదండ్రుల సమాధిలో పాతిపెట్టబడడానికి అక్కడికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు. అయ్యా, విను. నీ దాసుడు కింహాము ఇక్కడ ఉన్నాడు. నా ఏలినవాడవు, రాజువు అయిన నీతో కలసి రావడానికి అనుమతి ఇవ్వు. నీకు ఏది మంచి అనిపిస్తే అది అతడిపట్ల చెయ్యి” అని మనవి చేశాడు. 38 అప్పుడు రాజు “కింహాము నాతో కలసి రావచ్చు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేస్తాను. ఇంకా నా వల్ల నువ్వు ఏమి కోరుతావో అంతా చేస్తాను” అని చెప్పాడు. 39 అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. 40 రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలుకు వచ్చాడు. యూదావారు, ఇశ్రాయేలువారిలో సగంమంది రాజును వెంటబెట్టుకుని వచ్చారు. 41 ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలువారు రాజు దగ్గరికి వచ్చారు. “మా సహోదరులైన యూదావారు నిన్ను, నీ ఇంటివారిని దొంగిలించుకుని యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకు వచ్చారు?” అని అడిగారు. 42 అందుకు యూదా వారు “రాజు మీకు సమీపబంధువు గదా, మీకు కోపం ఎందుకు? అలాగైతే మాలో ఎవరమైనా రాజు ద్వారా లాభం పొందామా? లేక మాకోసం ఏమైనా దొంగతనం చేశామా?” అని ఇశ్రాయేలు వారితో అన్నారు. 43 ఇశ్రాయేలువారు “రాజులో మాకు పది వంతులు ఉన్నాయి. దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా” అని యూదావారితో అన్నారు.యూదావారు ఇశ్రాయేలువారి కంటే కఠినంగా మాట్లాడారు.