2 Samuel 7 (IRVT2)
1 యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి, 2 “నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు. 3 అప్పుడు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి” అన్నాడు. 4 అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది, 5 “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా? 6 ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను బయటకు రప్పించినప్పటి నుండి నేటి వరకూ మందిరంలో నివసించకుండా డేరాలో, గుడారంలో నివసిస్తూ సంచరించాను. 7 ఇశ్రాయేలీయులతో కలసి నేను సంచరించిన కాలమంతా నా ప్రజలను సంరక్షించమని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రా నాయకుల్లో ఎవ్వరితోనైనా దేవదారు కలపతో నాకొక మందిరం కట్టించలేకపోయారే అని ఎవ్వరితోనైనా అన్నానా? 8 కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను. 9 నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను. 10 నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి, 11 నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను.యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను వారు శాశ్వతంగా పాలన చేస్తారు. 12 నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. 13 అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను. 14 అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను. 15 అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను. 16 నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.” 17 తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు. 18 అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది? 19 నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను? 20 యెహోవా నా ప్రభూ, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు. 21 నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు. 22 దేవా, యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు. 23 నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు. 24 యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు. 25 దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చీ, నా వంశం గూర్చీ నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు. 26 ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలనే మాటచేత నీకు శాశ్వత మహిమ కలిగేలా నీ దాసుడనైన నా వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడేలా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు. 27 ఇశ్రాయేలీయుల దేవా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నాకు సంతానం కలిగిస్తానని నీ దాసునికి తెలియపరచావు. కాబట్టి ఈ విధంగా నీతో విన్నపం చేయడానికి నీ దాసుడనైన నాకు ధైర్యం వచ్చింది. 28 యెహోవా, నా ప్రభూ, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి. 29 నీ దాసుడనైన నా వంశం అంతా నిత్యమూ నీ సన్నిధిలో ఉండేలా దయచేసి దీవించు. యెహోవా నా ప్రభూ, నువ్వు సెలవిచ్చినట్టు నీ దీవెనలు పొంది నా వంశం అన్నివేళలా దీవెన పొందుతుంది గాక.”