1 Chronicles 21 (IRVT2)
1 తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు. 2 అప్పుడు దావీదు యోవాబుకూ ప్రజల అధిపతులకూ “మీరు వెళ్లి బెయేర్షెబా నుండి దాను వరకూ ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కపెట్టి, జనసంఖ్య నాకు తెలియజేయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 3 అందుకు యోవాబు “రాజా నా ప్రభూ, యెహోవా తన ప్రజలను ఇప్పుడున్న వారికంటే వందరెట్లు ఎక్కువమందిగా చేస్తాడు గాక. వాళ్ళందరూ నా ప్రభువుకు దాసులు కారా? నా ప్రభువుకు ఈ వివరం ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇది జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది” అన్నాడు. 4 కాని, యోవాబు మాట చెల్ల లేదు. రాజు మాటే చెల్లింది కాబట్టి యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా తిరిగి యెరూషలేముకు వచ్చాడు. 5 ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు పదకొండు లక్షలమంది. యూదావాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భైవేలమందిగా లెక్కకు వచ్చారు. 6 రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు. 7 ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు. 8 దావీదు “నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను. నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి” అని దేవునికి మొర్రపెట్టాడు. 9 దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా “నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, 10 యెహోవా చెప్పేదేమంటే, మూడు విషయాలు నేను నీముందు ఉంచుతున్నాను. వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకో. దాన్ని నీకు చేస్తాను” అన్నాడు. 11 కాబట్టి, గాదు దావీదు దగ్గరికి వచ్చి, 12 “మూడు సంవత్సరాలు కరువు కలగడం, లేదా మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక ఓటమి పాలవ్వడం, లేదా, మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం, అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం.ఈ మూడింట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి, నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు” అన్నాడు. 13 అందుకు దావీదు “నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను” అని గాదుతో అన్నాడు. 14 కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు. 15 యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు. 16 దావీదు తేరిచూడగా, భూమ్యాకాశాల మధ్యలో నిలిచి, వరలోనుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడ్డాడు. అప్పుడు దావీదూ, పెద్దలూ, గోనెపట్టలు కట్టుకుని, సాష్టాంగపడ్డారు. 17 దావీదు “ప్రజలను లెక్కపెట్టమని ఆజ్ఞ ఇచ్చినవాణ్ణి నేనే కదా? పాపం చేసి చెడుతనం జరిగించిన వాణ్ణి నేనే కదా? గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? యెహోవా, నా దేవా, బాధపెట్టే నీ చెయ్యి నీ ప్రజల మీద ఉండకుండాా నా మీద, నా తండ్రి ఇంటివారి మీద ఉండనియ్యి” అని దేవునికి మనవి చేశాడు. 18 “యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు” అని యెహోవా దూత గాదుకు చెప్పాడు. 19 యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు. 20 అప్పుడు ఒర్నాను గోదుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి అతడు, అతనితోపాటు ఉన్న అతని నలుగురు కొడుకులూ దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను దగ్గరికి రాగా అతడు దావీదును చూసి, కళ్ళంలోనుంచి బయటకు వచ్చి, తల నేల వరకూ వంచి దావీదుకు నమస్కారం చేశాడు. 22 అప్పుడు దావీదు ఒర్నానుతో “ఈ తెగులు ప్రజలను విడిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న చోట నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి తగిన ఖరీదుకు దాన్ని నాకు అమ్ము” అన్నాడు. 23 ఒర్నాను “రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో, దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోదుమ పిండి, అన్నీ నేను ఇస్తాను” అని దావీదుతో అన్నాడు. 24 అప్పుడు రాజైన దావీదు “అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకు యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన వెల ఇచ్చి తీసుకుంటాను” అని ఒర్నానుతో చెప్పి, 25 ఆ స్థలం కోసం ఆరువందల తులాల బంగారం అతనికి ఇచ్చాడు. 26 తరువాత దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టించి, దహనబలులు, సమాధానబలులు అర్పించి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుంచి దహన బలిపీఠం మీదికి అగ్నితో అతనికి జవాబిచ్చాడు. 27 యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు. 28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవా తనకు జవాబిచ్చాడని దావీదు చూసి అక్కడే బలి అర్పించాడు. 29 మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి. 30 అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.
In Other Versions
1 Chronicles 21 in the ANTPNG2D
1 Chronicles 21 in the BNTABOOT
1 Chronicles 21 in the BOATCB2
1 Chronicles 21 in the BOGWICC
1 Chronicles 21 in the BOHNTLTAL
1 Chronicles 21 in the BOILNTAP
1 Chronicles 21 in the BOKHWOG
1 Chronicles 21 in the KBT1ETNIK
1 Chronicles 21 in the TBIAOTANT