2 Chronicles 28 (IRVT2)
1 ఆహాజు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు 20 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతడు తన పూర్వికుడు దావీదులాగా యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించలేదు. 2 అతడు ఇశ్రాయేలు రాజుల విధానాల్లోనే నడిచి, బయలు దేవుడికి పోతవిగ్రహాలను చేయించాడు. 3 బెన్ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. 4 అతడు ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కింద, బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు. 5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతణ్ణి అరాము రాజు చేతికి అప్పగించాడు. అరామీయులు అతణ్ణి ఓడించి అతని ప్రజల్లో చాలమందిని బందీలుగా తీసుకుని దమస్కు తీసుకుపోయారు. యెహోవా అతణ్ణి ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఆ రాజు అతణ్ణి ఓడించాడు. 6 రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది. 7 జిఖ్రీ అనే పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడు రాజ కుమారుడు మయశేయానూ రాజ భవన అధికారి అజ్రీకామునూ రాజు తరువాత ప్రముఖుడు ఎల్కనానూ చంపేసాడు. 8 ఇశ్రాయేలువారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ 2,00,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు. 9 అయితే యెహోవా ప్రవక్త ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఓదేదు. అతడు షోమ్రోనుకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్ళాడు. వారితో ఇలా చెప్పాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించాడు. కాబట్టి ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు మిన్నంటే క్రోధంతో వారిని చంపేశారు. 10 ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా? 11 అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.” 12 అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దల్లో యోహానాను కొడుకు అజర్యా, మెషిల్లేమోతు కొడుకు బెరెక్యా, షల్లూము కొడుకు యెహిజ్కియా, హద్లాయి కొడుకు అమాశా అనేవారు యుద్ధం నుంచి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇలా అన్నారు. 13 “యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.” 14 కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు ఆ బందీలనూ కొల్లసొమ్మునూ విడిచిపెట్టారు. 15 పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు. 16 ఆ కాలంలో ఎదోమీయులు మళ్ళీ వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. 17 రాజైన ఆహాజు తనకు సహాయం చేయమని అష్షూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు. 18 ఫిలిష్తీయులు మైదానాల ప్రాంతంలోని పట్టణాలనూ యూదాలోని నెగేవునూ ఆక్రమించారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో దాని గ్రామాలనూ తిమ్నా దాని గ్రామాలనూ గిమ్జో దాని గ్రామాలనూ ఆక్రమించుకుని అక్కడ నివసించారు. 19 ఆహాజు యూదాదేశంలో విగ్రహాలను పూజించి యెహూవా పట్ల ద్రోహం చేశాడు కాబట్టి యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దాన్నిబట్టి యూదాను అణచివేశాడు. 20 అష్షూరురాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి బలపరచడానికి బదులు బాధపరచాడు. 21 ఆహాజు, యెహోవా మందిరంలో నుంచి, రాజ భవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు, కానీ దాని వల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేక పోయింది. 22 తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు. 23 ఎలాగంటే “అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి. 24 ఆహాజు దేవుని మందిరపు సామాను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు. 25 యూదాదేశంలోని పట్టణాలన్నిటిలో అతడు అన్యుల దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి, తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. 26 అతని గురించిన ఇతర విషయాలు, అతని పద్ధతులను గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. 27 ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు, గానీ ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతణ్ణి తేలేదు. అతని కొడుకు హిజ్కియా అతనికి బదులు రాజయ్యాడు.
In Other Versions
2 Chronicles 28 in the ANTPNG2D
2 Chronicles 28 in the BNTABOOT
2 Chronicles 28 in the BOATCB2
2 Chronicles 28 in the BOGWICC
2 Chronicles 28 in the BOHNTLTAL
2 Chronicles 28 in the BOILNTAP
2 Chronicles 28 in the BOKHWOG
2 Chronicles 28 in the KBT1ETNIK
2 Chronicles 28 in the TBIAOTANT