Deuteronomy 9 (IRVT2)
1 “ఇశ్రాయేలూ విను. మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు, ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోడానికి ఈ రోజు మీరు యొర్దాను నది దాటబోతున్నారు. 2 ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. ‘అనాకీయులను ఎవరూ ఎదిరించలేరు’ అనే మాట మీరు విన్నారు కదా. 3 కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు 4 మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరవాత ‘మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు’ అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు. 5 మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోడానికి కారణం మీ నీతి గానీ మీ హృదయంలో ఉన్న యథార్థత గానీ కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు. 6 మీ యెహోవా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయడం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు. 7 ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 8 హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు. 9 ఆ రాతి పలకలు, అంటే యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోడానికి నేను కొండ ఎక్కినప్పుడు, అన్నపానాలు మాని అక్కడ నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను. 10 అప్పుడు యెహోవా తన వేలితో రాసిన రెండు రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి. 11 ఆ నలభై పగళ్లు, నలభై రాత్రుల తరువాత యెహోవా నిబంధన సంబంధమైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించి, 12 ‘నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు’ అని నాతో చెప్పాడు. 13 యెహోవా ఇంకా ‘నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు. 14 నాకు అడ్డం రావద్దు. నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి, నిన్ను వారికంటే బలమైన, విస్తారమైన జనంగా చేస్తాను’ అని నాతో చెప్పాడు. 15 నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి. 16 నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు. 17 అప్పుడు నేను ఆ రెండు పలకలను, నా రెండు చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను. 18 మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. 19 ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు. 20 అంతేగాక యెహోవా అహరోనుపై కోపపడి, అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను. 21 అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను. 22 అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. 23 యెహోవా ‘కాదేషు బర్నేయలో మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు. 24 నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 25 కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు. 26 నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు. 27 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు. 28 ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో. 29 నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.”
In Other Versions
Deuteronomy 9 in the BOHNTLTAL
Deuteronomy 9 in the KBT1ETNIK
Deuteronomy 9 in the TBIAOTANT