Job 29 (IRVT2)
1 యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. 2 గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు! 3 అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను. 4 నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది! 5 సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు. 6 నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది. 7 పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు, 8 యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు. 9 అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు. 10 ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది. 11 నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు. 12 ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను. 13 నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను. 14 నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది. 15 గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను. 16 దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను. 17 దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను. 18 అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను. 19 నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది. 20 నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది. 21 మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు. 22 నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి. 23 వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు. 24 వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు. 25 నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను.