Acts 23 (IRVT2)
1 పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు. 2 అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు. 3 పౌలు అతణ్ణి చూసి, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?” అన్నాడు. 4 అప్పుడు దగ్గర ఉన్నవారు, “నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?” అన్నారు. 5 అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు.‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు’ అని రాసి ఉంది” అన్నాడు. 6 అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు. 7 అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. 8 సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు. 9 అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు. 10 కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు. 11 ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు. 12 తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు. 13 నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు. 14 వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం. 15 కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు. 16 అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు. 17 అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరకి తీసుకు వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది” అన్నాడు. 18 శతాధిపతి ఆ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, “ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట” అని చెప్పాడు. 19 సహస్రాధిపతి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, ‘నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?’ అని ఒంటరిగా అడిగాడు. 20 అందుకతడు, “నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురు చూస్తున్నారు. 21 వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు” అని చెప్పాడు. 22 అప్పుడు ఆ సహస్రాధిపతి, “నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు” అని హెచ్చరించి పంపేశాడు. 23 తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, “కైసరయ వరకూ వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులనూ డెబ్భై మంది గుర్రపురౌతులనూ రెండు వందలమంది ఈటెల వారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి. 24 గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి” అని చెప్పాడు. 25 అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు, 26 “అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు. 27 యూదులు ఈ వ్యక్తిని పట్టుకుని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను. 28 వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసుకువెళ్ళాను. 29 వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు. 30 అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను.” 31 కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసుకువెళ్ళారు. 32 మరునాడు వారు గుర్రపు రౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు. 33 వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు. 34 గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియకు చెందినవాడని తెలుసుకుని, 35 “నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను” అని చెప్పి, హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.