Ecclesiastes 6 (IRVT2)
1 సూర్యుని కింద ఒక అన్యాయం నేను చూశాను. అది మనుషులకు గొప్ప దురవస్థగా ఉంది. 2 అదేంటంటే, దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడు. అతడేం కోరినా అది కొరత లేకుండా ఇస్తాడు. అయితే దాన్ని అనుభవించే శక్తి మాత్రం దేవుడు అతనికి ఇవ్వడు. వేరే వ్యక్తి దాన్ని అనుభవిస్తాడు. ఇది నిష్ప్రయోజనంగా, గొప్ప అన్యాయంగా కనిపిస్తున్నది. 3 ఒకడు వంద మంది పిల్లలను కని, దీర్ఘాయువుతో ఎల్లకాలం జీవించినా, అతడు హృదయంలో సంతృప్తి అంటే తెలియకుండా, చనిపోయిన తరవాత తగిన రీతిలో సమాధికి నోచుకోకపోతే వాడికంటే పుట్టగానే చనిపోయిన పిండం మేలని నేను తలుస్తున్నాను. 4 అది నిర్జీవంగా వచ్చి చీకటి లోకి వెళుతుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. 5 అది సూర్యుణ్ణి చూడలేదు, దానికేమీ తెలియదు. అతనికి లేని విశ్రాంతి దానికి ఉంది. 6 అలాటి వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బతికినా సంతోషించలేక పోతే అతడు కూడా మిగిలిన అందరూ వెళ్ళే స్థలానికే వెళ్తాడు కదా! 7 మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే.అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు. 8 మూర్ఖుల కంటే జ్ఞానుల గొప్పతనం ఏమిటి?ఇతరుల ముందు ఎలా జీవించాలో తెలిసిన బీదవాడి గొప్పతనం ఏమిటి? 9 మనస్సు పొందలేని దాని గురించి ఆశపడడం కంటే కంటికి ఎదురుగా ఉన్నదానితో తృప్తి పడడం మంచిది.ఇది కూడా నిష్ప్రయోజనమే, గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడమే. 10 ఇప్పుడు ఉన్నది చాలా కాలం క్రితం తెలిసిందే.మనుషులు ఎవరు ఎలా ఉంటారో అది పూర్వం తెలిసిన విషయమే.తమకంటే బలవంతుడైన వ్యక్తితో వారు వాదన పెట్టుకోలేరు. 11 పలికిన మాటల్లో వ్యర్థమైనవి చాలా ఉంటాయి.వాటివలన మనుషులకేం ప్రయోజనం? 12 నీడలాగా తమ జీవితాలను వ్యర్థంగా గడిపేసే మనుషులకు తమకేది మంచిదో ఎవరికి తెలుసు?వారు పోయిన తరువాత ఏమి జరుగుతుందో వారికి ఎవరు చెప్పగలరు?
In Other Versions
Ecclesiastes 6 in the ANTPNG2D
Ecclesiastes 6 in the BNTABOOT
Ecclesiastes 6 in the BOHNTLTAL
Ecclesiastes 6 in the BOILNTAP
Ecclesiastes 6 in the KBT1ETNIK
Ecclesiastes 6 in the TBIAOTANT