Deuteronomy 11 (IRVT2)
1 “కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి. 2 మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. 3 ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు, 4 ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు. 5 యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు. 6 అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు. 7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా. 8 కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ, 9 యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి. 10 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు. 11 మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. 12 అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది. 13 కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే, 14 మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు. 15 మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు. 16 మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి. 17 లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు. 18 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి. 19 మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. 20 మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి. 21 ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి. 22 మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి. 23 అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు. 24 మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది. 25 ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు. 26 చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను. 27 నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది. 28 మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది. 29 కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి. 30 అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా. 31 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు. 32 ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”
In Other Versions
Deuteronomy 11 in the ANTPNG2D
Deuteronomy 11 in the BNTABOOT
Deuteronomy 11 in the BOHNTLTAL
Deuteronomy 11 in the BOILNTAP
Deuteronomy 11 in the KBT1ETNIK
Deuteronomy 11 in the TBIAOTANT