Deuteronomy 23 (IRVT2)
1 “చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. 2 అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. 3 అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. 4 ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు. 5 అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు. 6 మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు. 7 ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు.ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు. 8 వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు. 9 మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి. 10 రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి. 11 అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు. 12 శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి. 13 మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి. 14 మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో. 15 తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు. 16 అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు. 17 ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. 18 పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. 19 మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. 20 పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు. 21 మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. 22 ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు. 23 మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి. 24 మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు. 25 మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”
In Other Versions
Deuteronomy 23 in the ANTPNG2D
Deuteronomy 23 in the BNTABOOT
Deuteronomy 23 in the BOHNTLTAL
Deuteronomy 23 in the BOILNTAP
Deuteronomy 23 in the KBT1ETNIK
Deuteronomy 23 in the TBIAOTANT