Jeremiah 19 (IRVT2)
1 యెహోవా ఇలా చెప్పాడు, 2 నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు. 3 “యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది. 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు. 5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.” 6 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్ హిన్నోము లోయ అని గానీ అనరు. 7 ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను. 8 ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు. 9 వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు. 10 ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.” 11 “సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.” 12 యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను. 13 యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.” 14 యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు, 15 “సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”