Job 24 (IRVT2)
1 సర్వశక్తుడు దుష్టులను శిక్షించే నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు?ఆయనను ఎరిగినవారు ఆయన తీర్పు దినాలను ఎందుకు చూడడం లేదు? 2 సరిహద్దు రాళ్లను తీసేసే వారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు. 3 వారు తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు. విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు. 4 వారు అవసరంలో ఉన్న వారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటబడకుండా దాక్కోవలసి వచ్చింది. 5 అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్టు పేదలు బయలుదేరి ఆహారం కోసం వెతుకులాడతారు.ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. 6 పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు. 7 బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు. 8 పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగలించుకుంటారు. 9 తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసే వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు. 10 దరిద్రులు కట్టు బట్టలు లేక తిరుగులాడుతారు. ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు. 11 వారు తమ యజమానుల ప్రహరీ లోపల నూనె గానుగలు ఆడిస్తారు. ద్రాక్ష గానుగలను తొక్కుతూ, తాము మాత్రం దాహంతో ఉంటారు. 12 పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు. క్షతగాత్రులు మొర పెడుతూ ఉంటారు. కానీ దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు. 13 ఈ దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవల్లో నిలవరు. 14 తెల్లవారే సమయంలో హంతకుడు బయలు దేరుతాడు. వాడు పేదలను, అవసరంలో ఉన్న వారిని చంపుతాడు. రాత్రివేళ వాడు దొంగతనం చేస్తాడు. 15 వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడదనుకుని తన ముఖానికి ముసుకు వేసుకుని సందె చీకటి కోసం కనిపెడతాడు. 16 దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు. 17 ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు. 18 వారు జలాల మీద తేలికగా కొట్టుకు పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్థం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు. 19 అనావృష్టి మూలంగా వేడిమి మూలంగా మంచు, నీళ్లు ఆవిరై పోయేలా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. 20 వారిని కన్న గర్భమే వారిని మరిచి పోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు. 21 వారు గొడ్రాళ్ళను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు. 22 ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు. 23 తమకు భద్రత ఉందిలే అని వారు అనుకునేలా ఆయన చేస్తాడు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉంటారు. కానీ ఆయన కళ్ళు వారి మార్గాల మీద ఉన్నాయి. 24 వారు ఘనత పొందినా కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళ లాగానే కొట్టుకుపోతారు. పక్వం అయిన వెన్నుల్లాగా వారిని కోసివేయడం జరుగుతుంది. 25 ఇప్పుడు ఇలా జరగక పోతే నేను అబద్ధికుడినని ఎవరు రుజువు చేస్తారు? నా మాటలు విలువ లేనివని చూపించేది ఎవరు?