Luke 19 (IRVT2)
1 ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి 2 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు. 3 ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడడం వలనా ఇతడు పొట్టివాడు కావడం వలనా చూడలేకపోయాడు. 4 అప్పుడు యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. 5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, “జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు. 6 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. 7 అది చూసి అందరూ, “ఈయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు” అని గొణగడం మొదలుపెట్టారు. 8 జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు. 9 అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. 10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు” అని చెప్పాడు. 11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు. 12 “గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు. 13 దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు. 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు. 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు. 16 “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు. 17 దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. 18 ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు. 19 యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. 20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం. 21 దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు. 22 అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా, 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి, 24 తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు. 25 దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు. 26 అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’ 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.” 28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు. 29 ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. 30 “మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. 31 ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు. 32 ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. 33 ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు. 34 దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు. 35 తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు. 36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. 37 ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. 38 “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. 39 ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. 40 ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 41 ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు. 42 “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు. 43 ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు. 44 నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు. 45 45-46 అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. 47 ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు. 48 కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.