Jeremiah 50 (IRVT2)
1 కల్దీయుల దేశమైన బబులోనును గూర్చి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చేసిన ప్రకటన. 2 దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి.ఇలా చెప్పండి. “బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి. 3 దాని భూమిని నాశనం చేయడానికి దానికి వ్యతిరేకంగా ఉత్తర దిక్కునుండి ఒక జనం లేచింది.మనిషైనా, జంతువైనా దానిలో నివసించరు. వాళ్ళంతా పారిపోతారు.” 4 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు. 5 సీయోనుకు వెళ్ళే మార్గం ఏది అంటూ వాకబు చేస్తారు. ఆ మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు.ఉల్లంఘించలేని శాశ్వత నిబంధనలో యెహోవాను కలవడానికి కలిసి వెళ్తారు. 6 నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు.ఒక కొండ నుండి మరో కొండకు వాళ్ళని తిప్పారు. వాళ్ళు వెళ్ళారు. చివరకు తాము నివసించిన చోటు మర్చిపోయారు. 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు ‘మేం అపరాధులం కాము.ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’ అన్నారు. 8 బబులోనులో నుండి బయల్దేరండి. కల్దీయుల దేశంలో నుండి పారిపోండి.మందకు ముందు నడిచే మేకపోతుల్లా ప్రజలకు ముందు నడవండి. 9 ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను.వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు.వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు. 10 కల్దీయుల దేశం దోపుడు సొమ్ము అవుతుంది. దాన్ని దోచుకునే వాళ్ళంతా సంతృప్తి చెందుతారు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. 11 “నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు.పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు.బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు. 12 కాబట్టి మీ తల్లి ఎంతో అవమానం పాలవుతుంది. మిమ్మల్ని కడుపున కన్న ఆమె ఎంతో చీకాకుపడుతుంది.జనాలన్నిటిలో ఆమె నీచమైనదిగా ఉంటుంది. ఆమె ఎడారిగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ ఉంటుంది. 13 యెహోవాకు కలిగిన క్రోధాన్ని బట్టి బబులోను నిర్మానుష్యమవుతుంది. సర్వనాశనమవుతుంది.బబులోను దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దాని గాయాలను చూసి దాన్ని తిరస్కరిస్తారు. 14 బబులోనుకు చుట్టూ బారులు తీరండి. విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కడూ ఆమెపై బాణం వెయ్యాలి.ఆమె యెహోవాకు విరోధంగా పాపం చేసింది. కాబట్టి మీ బాణాలు దాచుకోవద్దు. 15 దాని చుట్టూ నిలిచి జయజయ ధ్వానాలు చేయండి. ఆమె తన అధికారాన్ని వదులుకుంది. ఆమె గోపురాలు కూలిపోయాయి.దాని గోడలు పడిపోతున్నాయి. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.అది ఇతర దేశాలకు చేసినట్టే మీరు దానికి చేయండి. 16 బబులోనులో విత్తనాలు చల్లే వాణ్ణీ, కొడవలి తీసుకుని పంట కోసే వాణ్ణీ ఉండకుండా వాళ్ళను నిర్మూలం చేయండి.క్రూరమైన ఖడ్గానికి భయపడి వారందరు తమ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు తమ తమ దేశాలకు పారిపోతున్నారు. 17 ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు.దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు.” 18 కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, అష్షూరు రాజును నేను దండించినట్టు బబులోను రాజునూ అతని దేశాన్నీ దండించ బోతున్నాను. 19 ఇశ్రాయేలును తన స్వదేశానికి నేను చేరుస్తాను. అతడు కర్మెలు, బాషానులపై మేత మేస్తాడు.ఎఫ్రాయిము, గిలాదు మన్య ప్రాంతాల ద్వారా అతడు తృప్తి చెందుతాడు.” 20 యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలులో అతిక్రమాల కోసం వెదుకుతారు, కానీ ఎంత వెదికినా అవి కనపడవు.యూదా ప్రజల పాపాల కోసం వాకబు చేస్తాను కానీ అవి దొరకవు. మిగిలి ఉన్న వాళ్ళను నేను క్షమిస్తాను. 21 మెరాతయీయుల దేశంపైకి దండెత్తి వెళ్ళండి. అలాగే పెకోదీయుల దేశం పైకి వెళ్ళండి.వాళ్ళని కత్తితో అంతం చెయ్యి. వాళ్ళను నాశనం చెయ్యి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.“నేను ఆజ్ఞాపించిన ప్రకారం చెయ్యి. 22 వినండి, యుద్ధమూ, మహా వినాశనమూ జరుగుతున్న ధ్వని వినిపిస్తున్నది. 23 అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి.దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి 24 బబులోనూ, నేను నీ కోసం ఒక బోను పెట్టాను. నువ్వు అందులో చిక్కావు. కానీ ఆ సంగతి నీకు తెలియలేదు.యెహోవా అనే నన్ను సవాలు చేశావు. కాబట్టి నిన్ను వెతికి పట్టుకున్నాను.” 25 కల్దీయుల దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు చేయాల్సిన పని ఉంది.ఆయన తన క్రోధాన్ని చూపడానికి తన ఆయుధాగారాన్ని తెరచి ఆయుధాలను బయటకు తీస్తున్నాడు. 26 దూరం నుండే ఆమెపై దాడి చేయండి. ఆమె ధాన్యాగారాన్ని తెరవండి. ధాన్యం కుప్పలు పోసినట్టుగా ఆమెను కుప్పలుగా వేయండి.ఆమెను నాశనం చేయండి. ఆమెలో ఏదీ మిగల్చకుండా నాశనం చేయండి. 27 ఆమె యెడ్లన్నిటినీ చంపండి. వధశాలకు వాటిని పంపండి.అయ్యో, వాళ్ళకు బాధ. వాళ్ళ దినం, వాళ్ళ శిక్షాకాలం వచ్చింది. 28 వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది.సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి. 29 “బబులోనుకు రమ్మని బాణాలు వేసే వాళ్ళను పిలవండి. తమ విల్లును వంచే వాళ్ళందరినీ పిలవండి.మీరు దాని చుట్టూ శిబిరం వేయండి. ఎవర్నీ తప్పించుకోనీయవద్దు.ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఆమెకు చెల్లించండి.ఆమె చేసిన పనులను బట్టి ఆమెకూ చేయండి.ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను అవమానించింది. 30 కాబట్టి ఆమె యువకులు పట్టణం వీధుల మూలల్లో పడిపోతారు. ఆమె కోసం యుద్ధం చేసే వీరులందరూ ఆ రోజున నాశనమౌతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 31 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను.నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి. 32 అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు.నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.” 33 సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారితో పాటు అణచివేతకు గురయ్యారు.వాళ్ళను చెర పట్టిన వాళ్ళందరూ వాళ్ళని ఇంకా పట్టుకునే ఉన్నారు. వాళ్ళను విడిచి పెట్టడానికి ఒప్పుకోవడం లేదు. 34 వాళ్ళను విడుదల చేసే వాడు శక్తి గలిగిన వాడు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. భూమికి విశ్రాంతి కలగజేయడానికీ, బబులోను నివాసుల్లో కలహం పుట్టించడానికీ ఆయన తన ప్రజల పక్షం వహిస్తాడు.” 35 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “కల్దీయులకూ. బబులోను నివాసులకూ వాళ్ళ నాయకులకూ,వాళ్ళల్లో జ్ఞానులకూ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. 36 తమను తాము మూర్ఖుల్లా కనపరచుకోడానికి వాళ్ళలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.సైనికులు భయకంపితులు అయ్యేలా ఒక కత్తి వాళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. 37 వాళ్ళ గుర్రాలకూ, రథాలకూ, బబులోనులో ఉన్న వాళ్ళందరికీ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.అందుచేత వాళ్ళు స్త్రీల వలే బలహీనులౌతారు. ఆమె గిడ్డంగులకు విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. వాటిని దోచుకుంటారు. 38 ఒక కత్తి ఆమె నీళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. ఊటలు ఇంకి పోయి నీటిఎద్దడి ఏర్పడుతుంది.ఎందుకంటే అది పనికిమాలిన విగ్రహాలున్న దేశం. ఈ భయంకరమైన విగ్రహాలను బట్టి ప్రజలు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. 39 కాబట్టి నక్కలతో పాటు ఎడారి జంతువులు అక్కడ నివాసముంటాయి. అక్కడే నిప్పుకోళ్ళూ నివసిస్తాయి.ఇకమీదట అది ఎప్పుడూ నివాస స్థలంలా ఉండదు. తరతరాల్లో అక్కడ ఎవరూ నివసించరు.” 40 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “దేవుడు సొదొమనూ గొమొర్రానూ వాటి చుట్టూ ఉన్న పట్టణాలనూ శిక్షించినప్పుడు జరిగినట్టే ఇప్పుడూ జరుగుతుంది.అక్కడ ఎవరూ నివసించరు. ఆ పట్టణంలో ఎవరూ కాపురముండరు. 41 ప్రజలు ఉత్తర దిక్కునుండి వస్తున్నారు. దూరప్రాంతంలోని ఒక గొప్ప జనం, అనేకమంది రాజులూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. 42 వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు.వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు. 43 బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి.ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది. 44 చూడండి! యొర్దాను ఉన్నత ప్రదేశం నుండి నిరంతరం నిలిచే పచ్చిక భూమిలోకి వచ్చే సింహంలా ఆయన వస్తున్నాడు.ఆ సింహాన్ని ఎదుర్కోలేక వాళ్ళు వెంటనే పారిపోయేలా చేస్తాను. దానికి అధికారిగా నేను ఎంపిక చేసిన వాణ్ణి నియమిస్తాను. నేనెవరిని ఏర్పరుస్తానో వాణ్ణి దాని మీద నియమిస్తాను. నాలాటి వాడెవడు? నన్ను ఆక్షేపించే వాడెవడు? నన్ను ఎదిరించగల కాపరి ఏడీ? 45 బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి.కల్దీయుల దేశాన్ని గూర్చి ఆయన ఉద్దేశించినది వినండి. నిశ్చయంగా మందలోని అల్పులైన వారిని వారు లాగుతారు.నిశ్చయంగా వారిని బట్టి వారు నివసించిన ప్రదేశం నిర్ఘాంతపోతుంది. 46 బబులోనును ఆక్రమించుకుంటున్నారు అనే వార్త విని భూమి కంపిస్తున్నది. జనాల్లో అంగలార్పు వినబడుతున్నది.”